చేపల వ్యాపారంతో చేతనైనంత సాయం.. అంగవైకల్యుని ఔదార్యం

మనిషికే కాని అంగవైకల్యం మనసుకి కాదు అని నిరూపించాడు దాసరి దుర్గారావు. రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చింది. అయినా తన వైకల్యాన్ని చూసి ఎన్నడూ చింతించలేదు. తాను మరికొంత మంది సహాయం చేయగలనని నిరూపించాడు. స్వశక్తితో సంపాదించుకుంటూ తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. విజయవాడ రాణీగారి తోట కాలనీలో నివసిస్తున్న దుర్గారావు ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటలకు లేచి తన త్రీ-వీలర్ స్కూటీపై 40 కి.మీల దూరంలో ఉన్న గుంటూరుకు బయలుదేరుతాడు. అక్కడి ప్రధాన కూరగాయల మార్కెట్ దగ్గర ఒక ఫుట్‌పాత్ వద్ద చేపల దుకాణాన్ని తెరిచి చేపలు విక్రయిస్తాడు.
తాజా చేపలను తీసుకువచ్చి అమ్ముతుండడంతో అతడి వద్దకే వినియోగదారులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వచ్చిన దాంట్లో ఒక వంతు భార్యకు ఇచ్చి మూడొంతులు ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపుతాడు. లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల ఆకలిని తీర్చాడు. ఇలా మూడు నెలల పాటు వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లు అందజేశినట్లు పేర్కొన్నాడు దుర్గారావు. తన భార్య నాగలక్ష్మి సాయంతో రోజుకు 4,5 వందల మందికి ఆహార ప్యాకెట్లతో పాటు నిత్యావసరాలను కూడా అందజేసేవాడినని ఆయన పేర్కొన్నాడు.
మచిలీపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి. అక్కడి పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసేందుకు నేను సుమారు 70 కి.మీ ప్రయాణం చేసేవాడినని తెలిపాడు. పదోతరగతి చదువుకున్న దుర్గారావు 2010లో తన తండ్రి మరణించిన తరువాత ఆయన చేసిన చేపల వ్యాపారాన్నే తన జీవనోపాధిగా మలచుకున్నాడు. అతడికి ముగ్గురు కుతుళ్లు ఉన్నారు.
ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చే విషయం అని దుర్గారావు చెప్పుకొచ్చాడు. అంగవైకల్యానికి గాను ప్రభుత్వం ఇచ్చే రూ.3,000 ల ఫెన్షన్ కూడా దాతృత్వానికే వినియోగిస్తాడు. తన ప్రయత్నానికి సాయం అందించేవారికోసం ఈ మధ్యే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అతడి సేవాహృదయానికి మెచ్చి లాక్ డౌన్ సమయంలో పది మంది దాకా సాయం అందించారని చెప్పాడు. కొందరు బియ్య సంచులు ఇస్తే మరికొందరు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు ఇచ్చారని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com