రూ. 12 కోట్ల స్థలాన్ని ఇళ్ల పట్టాలకు కేటాయించడంలో మర్మం ఏమిటో?

రూ. 12 కోట్ల స్థలాన్ని ఇళ్ల పట్టాలకు కేటాయించడంలో మర్మం ఏమిటో?
X

కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా ఉన్న కోట్లాది రూపాయలు విలువచేసే ఖరీదైన ప్రభుత్వ స్థలాలను ఇళ్ల పట్టాలకు ఎంపిక చేశారనే ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఎకరం 12 కోట్ల రూపాయలు పలికిన స్థలాన్ని పట్టాలకు కేటాయించడంలో మర్మం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల ప్రయోజనార్ధం దివంగత వైఎస్ పేరు మీద కన్వెన్షన్ సెంటర్ నిర్మించదలచిన ఈ స్థలం ఇప్పుడు ఇళ్ల పట్టాలకు కేటాయించడం ఏమిటని సాక్షాత్తు వైసీపీ నేతలే మండిపడుతున్నారు. పెద్దాయనకు కాంగ్రెస్ హయాంలో దక్కిన గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి చుట్టుపక్కల ఎన్టీఆర్ వెటర్నరీ యూనివర్సిటీ, పశు సంవర్ధక శాఖ పరిశోధన కేంద్రం, ఐటిపార్క్, ఆర్టీఓ టెస్టింగ్ కేంద్రం తోపాటు పలు ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరి ఉన్నాయి.

కాంగ్రెస్ హయాంలో దివంగత వైఎస్ పేరుతో ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిని రైతుల శాశ్వత ప్రయోజనాలకోసం తీర్చిదిదేలా ఏర్పాటు చేశారు. వ్యవసాయం పై ఆధారపడే రైతుల ఆదాయ వనరులను పెంపొందించే పశుసంపద అభివృద్ధికే కేంద్ర బిందువుగా వైఎస్ కన్వెన్షన్ సెంటర్ నిలవాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రైతుల శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ ఎక్సిబిషన్ వంటి కార్యకలాపాలకు అనువుగా అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా 17 ఎకరాల్లోని 7 ఎకరాలను ఉడాకు కేటాయించారు. అయితే ప్రభుత్వ కాంక్షలకు అనుగుణంగా వైఎస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలంటే తమకు మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని అప్పటి వుడా అధికారులు జిల్లా కలెక్టరును కోరడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర విభజన, ముఖ్యమంత్రి మారడం వంటి కారణాలతో ఈ కన్వేషన్ సెంటర్ అటకెక్కింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కన్వెన్షన్ సెంటర్ పట్టాలెక్కుతుందని వైఎస్ అభిమానులు భావించారు.

అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా కన్వెన్షన్ సెంటర్ ప్రతిపాదన అంగుళం కూడా ముందుకు జరగలేదు.. ఏమైందో ఏమో గతంలో వైఎస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనకు విరుద్ధంగా ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వైఎస్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని భావించిన ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని వారు మండిపడుతున్నారు. ఇందులో ఏమైనా తెరచాటు ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేదే లక్షమైతే ఖరీదైన ఈ భూములను అమ్మగా వచ్చే డబ్బుతో గన్నవరం మండలంలోని పేదలైన వారందరికీ అవసరమైన భూమిని జనావాసాల మధ్యే కొనుగోలు చెయ్యవచ్చని.. ఈ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story