వీల్‌చైర్ విజయం.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో సీటు

స్కూల్ ఆవరణలో అడుగుపెట్టగానే అందరూ సీతాకోక చిలుకల్లా పరుగులు తీస్తున్నారు. ఒక్క క్షణం బాధనిపించినా అంతలోనే తేరుకుని తనని తను సముదాయించుకుంది. చదువుపై దృష్టి సారించింది. ప్రతి తరగతిలో తనే ఫస్టు వచ్చేది. టీచర్లందరూ పిల్లలకి 'ప్రతిష్ట'ను చూసి నేర్చుకోమని చెప్పడం ఆనందాన్నిచ్చింది. అంచలంచెలుగా ఎదిగి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో సీటు సంపాదించుకుంది. దేశంలోనే అలాంటి యూనివర్శిటీలో సీటు పొందిన తొలి వీల్ చైర్ అమ్మాయి 'ప్రతిష్ట దేవేశ్వర్'.
పంజాబ్ కు చెందిన ప్రతిష్ట పదమూడేళ్ల వయసున్నప్పుడు కుటుంబం అంతా హోషియార్పూర్ నుంచి చండీగడ్ కు వెళుతున్నారు. సడన్ గా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కళ్లు తెరిచే సరికి అందరూ హాస్పిటల్లో ఉన్నారు. ప్రతిష్టకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆపరేషన్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని, శరీరంలో రక్తం కొరత ఏర్పడుతుందని అన్నారు. కానీ ప్రాణాలు కాపాడాలంటే మరో మార్గం లేదు. ఆపరేషన్ చేయక తప్పదు.
దేవుడి మీద భారం వేసి ఆపరేషన్ చేయించారు ప్రతిష్టకి తల్లిదండ్రులు. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ వెన్నెముకకు గాయం కారణంగా పక్షవాతం వచ్చింది. దాదాపు నాలుగు నెలలు ఐసియూలో ఉంచారు. తర్వాత మూడేళ్లపాటు పూర్తిగా బెడ్ కే పరిమితమైనా ఇంటి నుంచే స్కూల్ చదువు పూర్తి చేసింది. 10,12 తరగతుల్లో 90 శాతం మార్కులు వచ్చా యి. శారీరక బలహీనతల కారణంగా తన చదువు ఆగిపోకూడదని ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటానని అమ్మానాన్నలతో మాట్లాడింది. వారి ప్రోత్సాహంతో లేడీ శ్రీరామ్ కాలేజీలో సీటు సంపాదించుకుంది. కాలేజీ.. చదువుతో పాటు ధైర్యాన్ని అందించిందని చెబుతుంది ప్రతిష్ట.
భారతదేశం వికలాంగుల కోసం అనేక సంస్కరణలు చేయాల్సి వుంది. అందుకు అవసరమైన పబ్లిక్ పాలసీ కోర్సు కోసం చాలా యూనివర్శిటీలలో ప్రయత్నించారు. కానీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో సీటు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అందులో కోర్సు పూర్తి చేసి భారతదేశంలో నివసిస్తున్న 2 కోట్ల 68 లక్షల మంది వికలాంగుల కోసం పని చేయాలనుకున్నట్లు చెప్పింది ప్రతిష్ట. వీల్‌చైయిర్ నా లక్ష్యాన్ని ఆపలేదని రుజువు చేయాలనుకుంటున్నాను అని అంటోంది.
ఎవరి సహాయం లేకుండానే పనులు చేసుకోగలుగుతున్నాను కానీ మినీ బస్సులు, క్యాబుల్లో ప్రయాణించాలంటే చాలా కష్టం. అట్లాంటి పరిస్థితిలో కొన్ని కిలోమీటర్లు వీల్‌చైయిర్ లో ప్రయాణించవలసి వస్తుంది. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగితే ఏశక్తీ మిమ్మల్ని ఆపలేదని నిరూపించదలుచుకున్నాను. నిరంతరం కృషి చేస్తే మీ కలలు తప్పక నెరవేరతాయని ప్రతిష్ట ఎంతో నమ్మకంగా చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com