వైరస్ నిరోధానికి 'ఎన్-95' మాస్కులు వాడుతున్నారా.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనంలో..

వైరస్ నిరోధానికి ఎన్-95 మాస్కులు వాడుతున్నారా.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనంలో..
X

కొవిడ్ మొదలైన కొత్తలో సాధారణ మాస్కులకు కొరత ఏర్పడింది. ఎన్‌-95 మాస్క్ దొరుకుతుంటే ఎక్కువ రేటైనా కొన్నాం.. ఇప్పుడేమో వాటిని వినియోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తిని ఈ మాస్క్ అడ్డుకోలేదని, ఇంకా చెప్పాలంటే ఈ మాస్క్ వల్లే వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు.

సాధారణ మాస్కులను ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కవాటాలు (వాల్వ్స్) ఉన్న మాస్కులు ధరించడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. ఈ మాస్కులను పరిశ్రమల్లో తయారు చేసేవారు వినియోగిస్తారు. ఇవి వాతావరణంలో గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి. కానీ అదే సమయంలో మనం వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.

ఇలా చేయడంవల్ల వైరస్ కట్టడికి మాస్కులను ధరించాలన్న నియమ నిబంధనలకు అర్థమే లేకుండా పోతుంది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. అన్నిటికీ మించి వస్త్రంతో తయారు చేసిన మాస్కులే అత్యుత్తమైనవిగా అభివర్ణించింది. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. మాస్క్ ధరించి బయటకు వెళ్లి రాగానే వేడి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని చెప్పింది. ఎవరి మాస్క్ వారే ధరిస్తూ శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.

Tags

Next Story