ఇంటి ఓనర్ క్వారంటైన్ లో.. దొంగలు కిచెన్ లో..

ఇంటి ఓనర్ క్వారంటైన్ లో ఉన్నాడని.. ఇక ఆ ఇంట్లో మనదే రాజ్యమని ముందే ఫిక్సయిపోయి పెద్ద స్కెచ్ గీసుకున్నారు. గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డారు. కన్నం వేసిన ఇంట్లోనే అన్నం వండుకుని తిని, దర్జాగా చోరీ చేసి వెళ్లిపోయారు. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన ఓ వ్యక్తికి జూలై 8న కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో అతడు టాటా మెయిన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దొంగలు ఇదే అదనుగా భావించారు. పైగా ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఇంక ఎవరికీ మనగురించి అనుమానం రాదని నిర్ధారించుకున్నారు. ఎవరిళ్లు చూసినా పగలు, రాత్రి తలుపులు బిగించుకునే ఉంటున్నారు. గురువారం రాత్రి చడీ చప్పుడు కాకుండా దొంగలు ఇంట్లో దూరారు. ముందు కిచెన్ లోకి వెళ్లారు. అన్నం, మటన్ కూడా వండుకుని తినేసి, తీరిగ్గా బీరువా తెరిచి అందులో ఉన్న 50వేల రూపాయల నగదు, మరో 50వేల విలువ చేసే నగలు ఎత్తుకుని వెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

