'రండి ఆవును తిరిగి తీసుకుందాం'.. సోనూసూద్ మరోసారి..

కరోనా వచ్చి దినసరి కూలీలను మరీ కష్టాలపాలు చేసింది. రోజూ కూలిపనికి వెళితేనే కుటుంబపోషణ సాధ్యం కాని ఆ వ్యక్తి బిడ్డల చదువుల కోసం స్మార్ట్ ఫోన్లు కావాలంటే ఎక్కడినుంచి తీసుకువస్తాడు. కుటుంబానికి ఆధారమైన ఆవుని ఆరువేల రూపాయలుకు అమ్మేసి ఫోన్ కొన్నాడు. ఈ వార్తని పేపర్లో చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చలించి పోయారు. గత మూడు నెలల నుంచి కరోనా బాధితుల సహాయార్ధం ఏదో ఒక రూపంలో తన సేవలు అందిస్తూనే ఉన్నారు సోనూ.
తాజాగా ఈ వార్త చూసిన సోనూ.. రండి ఈ వ్యక్తి ఆవును తిరిగి తీసుకుందాం.. అతడి వివరాలను నాకు ఎవరైనా పంపగలరా అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి పాలంపూర్ నివాసి అని సోనూకి సమాచారం అందింది. దాంతో అతడికి ఆవును కొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సోనూసూద్. ఒక్కసారి సాయం చేస్తేనే వంద సార్లు చెప్పుకునే ఈ రోజుల్లో సోనుసూద్ లాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. మంచి మనసున్న సోనూని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com