కొవిడ్ నుంచి కోలుకునే మంత్రం 'మాట సాయం': శేఖర్ కమ్ముల

కొవిడ్ నుంచి కోలుకునే మంత్రం మాట సాయం: శేఖర్ కమ్ముల
X

ఆత్మీయ స్పర్శ, ప్రేమ పూర్వక పలకరింపు ఎంతటి అనారోగ్యాన్నైనా దూరం చేస్తుంది. కోవిడ్ వచ్చినా కోలుకోవచ్చు అనే భరోసా వైద్యులతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితులు అందిస్తే మహమ్మారిని జయించవచ్చు అని టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల అంటున్నారు. ఈ దిశగా ప్రజలకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలన్నారు. కరోనా వచ్చిన రోగులను వివక్షకు గురిచేయడం, సాయం చేసే వారిని వెనక్కు లాగడం వంటివి చేయడం తగదు. జాగ్రత్తలు పాటిస్తూ, ఉన్నంతంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉంటాము అనే విషయాన్ని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై అవగాహన కల్పించాలి అని అంటున్నారు శేఖర్ కమ్ముల. కరోనా సోకి కోలుకున్న ఓ వ్యక్తి కుటుంబ సభ్యునికి ఫోన్ చేసి ఏవిధంగా కొవిడ్ నుంచి బయటపడ్డారో అడిగి తెలుసుకున్నారు.

శేఖర్ కమ్ముల: మీ ఇంట్లో వాళ్లకు కరోనా వచ్చిందని తెలియగానే ఏం చేశారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని కొండల్ రెడ్డి అనే వ్యక్తిని అడిగారు.

కొండల్ రెడ్డి: 75 ఏళ్లున్న మామాయ్యకు కరోనా సోకిందని తెలియగానే చాలా ఆందోళన చెందాం. మధుమేహం, కంటిసమస్య, మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి మామయ్యకు. కొవిడ్ వచ్చిందని చుట్టుపక్కల వారు అంటరానివారిగా చూస్తారని భయపడ్డాం. కానీ స్నేహితులు కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ధైర్యం చెప్పారు. దాంతో ఆందోళన కొంత తగ్గింది. మామయ్యను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. తొమ్మిదో రోజు కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యాక సామాజిక దూరం పాటిస్తూ ఆయనకు సాయం చేసేవాళ్లం.

శేఖర్ కమ్ముల: కరోనా సమయంలో మిమ్మల్పి బాధించిన విషయాలు..

కొండల్ రెడ్డి: మాతో అయిదు రోజుల వరకు ఎవరూ మాట్లాడలేదు. తరువాత ఇరుగు పొరుగు సాయం అందించడం ప్రారంభించారు. చాలా మంది టెస్టులు చేయించుకోవడానికి వెనుకడుగు వేయడానికి కారణం కొవిడ్ వచ్చిన కుటుంబాన్ని అంటరానివారిగా చూడడమే. ఈ వివక్ష ఉండకూడదు. కనీసం మాట సాయమైనా చేయాలి. ఫోన్లో మెసేజ్ లు, టీవీలో వార్తలు చూడడం మానేశాం. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడింది.

శేఖర్ కమ్ముల: మామయ్యకు ఎలాంటి ఆహారం అందించారు?

కొండల్ రెడ్డి: ఆయన ఇష్టపడే జొన్న రొట్టె, రాగిసంకటి, పచ్చసొన లేని రెండు గుడ్లు, దానిమ్మ రసం అందిస్తున్నాం. మాకు ఇష్టమైందే మేమూ తింటున్నాం. వ్యాయామాలు చేసే అలవాటు ఉండడంతో కొవిడ్ వచ్చినా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Tags

Next Story