గుడ్డు పగిలింది.. అదృష్టం పట్టింది..

గుడ్డు పగిలింది.. అదృష్టం పట్టింది..
X

కష్టం అంతా రోడ్డుపాలైతే.. నష్టమే కదా మిగిలేది.. ఇంక అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటాము.. కానీ చేతిలో ఫోన్ ఉండేసరికి కొందరు తమ కంటికి కనిపించిన కొన్ని దృశ్యాలను క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి సదరు వ్యక్తి పట్ల సానుభూతి కురిపించడానికి, సత్వర న్యాయం జరగడానికి తోడ్పడుతున్నాయి. కానీ అందరి విషయంలో అలా జరక్కపోవచ్చు. దానిక్కూడా అదృష్టం ఉండాలేమో మరి.

ఇక అసలు విషయానికి వస్తే ఇండోర్ కి చెందిన పరాన్ అనే ఓ 13 ఏళ్ల బాలుడు కోడిగుడ్లను తోపుడు బండి మీద పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు సుమారు రూ.7వేల విలువైన కోడిగుడ్ల ట్రేలతో ఉన్న బండిని రోడ్డు పక్కన ఆపి ఎటో వెళ్లాడు. దాన్ని చూసిన మున్సిపల్ సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. రోడ్డు మీద ఈ బండేంటి అని అతడికి రూ.100 జరిమానా విధించడంతో పాటు తోపుడుబండిని తోసేశారు. దాంతో బండి మీద ఉన్న గుడ్లన్నీ పగిలిపోయాయి. అనుకోని ఈ పరిణామానికి బిత్తరపోయిన బాలుడు ఏడుపు లంఘించుకున్నాడు.

ఇదంతా రోడ్డు మీద వెడుతున్న కొందరు వ్యక్తులు చూసి వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. బాలుడి దీన స్థితికి కరిగిపోయారు. నగదు రూపంలో కొందరు, వస్తువుల రూపంలో మరికొందరు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రూ.10 వేలు పంపించడంతో పాటు బాలుడు చదువుకునేందుకు సహకరిస్తానని అన్నారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆ బాలుడికి ఓ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ బాలుడికి 2,500 నగదు, బట్టలు, ఓ సైకిలు పంపించారు. మరికొంత మంది రాజకీయ నాయకులు నగదు బహుమతులు అందజేస్తున్నారు. గుడ్డు పగిలింది.. అదృష్టం పట్టిందని స్థానికులు ఆ బాలుడిని ప్రశంసిస్తున్నారు.

Tags

Next Story