ఢిల్లీ జైళ్లలో 221 కరోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ జైళ్లలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఢిల్లీ జైళ్లలో 221 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా బారిన పడిన వారిలో 161 మంది సిబ్బంది, 60 మంది ఖైదీలు ఉన్నారు. అయితే, ఆ 60 మంది ఖైదీలలో 55 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి ఇద్దరు ఖైదీలు మరణించారు. రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓ ఖైదీ జైలు నుంచి విడుదలై హోంక్వారెంటైన్‌లో ఉన్నాడు.
ఇక కరోనా మహమ్మారి బారినపడ్డ 161 మంది జైలు సిబ్బందిలో 122 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 39 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే ఖైదీలు సిబ్బంది కలిపి ఢిల్లీ జైళ్లలో మొత్తం 41 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ జైళ్ల అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com