తనలా మరెవరూ కష్టపడకూడదని..: సూరత్ వ్యాపారి

డబ్బులుంటేనే కట్టడం కష్టంగా అనిపించింది కరోనా చికిత్సకు ఆస్పత్రిలో జాయినైన సూరత్ వ్యాపారికి. మరి పేదల పరిస్థితి ఏంటి అని పెద్దమనసుతో ఆలోచించారు. అనుకున్నదే తడవుగా పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు.
సూరత్ కు చెందిన ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి 20 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బిల్లు చేతిలో పెట్టారు. లక్షల్లో వచ్చిన బిల్లు చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు వ్యాపారి. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటని ఓ క్షణం ఆలోచించారు. పేదల కోసం తన వంతు సాయం చేయాలనుకున్నారు. 2,800 చదరపు మీటర్లు ఉన్న తన కార్యాలయ ప్రాంగణాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని పేదవాడు ప్రైవేట్ ఆస్పత్రి వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తానూ పేద కుటుంబంనుంచే వచ్చానని, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సాయం ఏదైనా చేయాలని భావించానన్నారు. కుత,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని తెలిపారు. వైద్య సిబ్బందిని, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, రోగులకు ఉచిత బెడ్ ను అందిస్తున్నానని చెప్పారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

