ప్యాంటులో పాము.. మూడు గంటల పాటు..

వంటి మీద ఓ చిన్న పురుగు పాకితేనే ఒళ్లంతా జలదరించినట్లు ఉంటుంది. అలాంటిది పాము.. వినడానికే భయంగా ఉంది. అలా ఎలా దూరిందో అతగాడి ప్యాంటులోకి.. పగలంతా పనిచేసి అలసి పోయిన ఆయువకుడు ఒళ్లూ పై తెలీకుండా పడుకున్నాడు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లా అరోరా గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు ఎనిమిది మంది కార్మికులు పని చేస్తున్నారు. కార్మికులంతా ఆరుబయట అక్కడే పని చేసిన ప్రాంతంలో నిద్రిస్తారు. ఇంతలో ఓ పాము లావ్‌రేశ్ కుమార్ అనే కార్మికుడి ప్యాంటులో దూరింది.
ఉదయం మూడు గంటలకు ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించి లేచి కూర్చున్నాడు. కొద్ది క్షణాలకు అది పామని అర్థమయ్యేసరికి గుండె ఆగినంత పనైంది. వెంటనే పక్కనే పడుకున్న తోటి కార్మికులకు చెప్పడంతో వారు పాములు పట్టే వాళ్లను తీసుకుని వచ్చారు. ఈ లోపు ఎక్కడ కదిలితే పాము కాటేస్తుందో అని భావించి పక్కనే ఉన్న స్థంభాన్ని పట్టుకుని నిల్చున్నాడు. పాములు పట్టే వ్యక్తి రావడానికి మూడు గంటలు టైమ్ పట్టింది. అంతవరకు కదలకుండా స్థంభాన్ని పట్టుకునే ఉన్నాడు.
అనంతరం పాములు పట్టే వ్యక్తి వచ్చి ప్యాంటు విప్పి పామును బయటకు తీశారు. అది విషసర్పమని ఆయన వెల్లడించారు. అదృష్టం బావుండి ఆ పాము కార్మికుడిని ఏమీ చేయలేదు. ఈ సంఘటన గురించి ప్రజలకు తెలియగానే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు కూడా వచ్చి చూసి కార్మికుడి ధైర్యానికి మెచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

