రాజధాని విషయంలో ఒకే మాట మీద ఉన్నాం: జనసేన

రాజధాని తరలింపుకు పూర్తి స్థాయిలో ప్రజామోదం లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రవేసిన నేపథ్యంలో జనసేన పీఎసీ సభ్యులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేయాల్సిన సయమం వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఉద్యమించకుండా కరోనా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి రైతులు రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ఇలా ప్రభుత్వాలు మారిన ప్రతీసారీ రాజధానులు మార్చితే.. ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. కానీ, ఇకపై భూసేకరణలు చేపడితే, ప్రజలు నమ్మే పరిస్తితిలేదని అన్నారు. రాజధాని విషయంలో జనసేన పార్టీ మొదటినుంచి ఒకే మాట మీద ఉందని అన్నారు. అటు, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాజధాని తరలింపు ప్రభుత్వం నిర్ణయం కాదని.. వ్యక్తిగత అజెండా అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్, పీఎసీ సభ్యులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com