భళా బామ్మ.. 105 ఏళ్ల వయసులో కరోనాని జయించింది

భళా బామ్మ.. 105 ఏళ్ల వయసులో కరోనాని జయించింది

ఇంత సుదీర్ఘ జీవితంలో బామ్మ ఎన్ని చూసుంటుంది. కరోనా ఒక లెక్కా అని కాలితో వైరస్ ని తన్ని అవతల పడేసింది. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆనందంగా ఇంటికి వచ్చింది 105 ఏళ్ల బామ్మ. మనో నిబ్బరం.. మానసిక స్థైర్యం ఉంటే ఏ వైరస్సూ మనల్ని ఏమీ చేయదని బాసింపట్టు వేసుక్కూర్చుని మరీ చెప్తోంది. అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఈ బామ్మ కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానా వీధికి చెందిన మోహనమ్మ.

బామ్మ భర్త 1991లో మరణించారు. ఆయన బంగారు నగలు తయారు చేసే పనిలో ఉండేవారు. ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు.. అయిదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు ఇటీవలే మరణించాడు. మిగిలిన కుమారులు ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు మరణించారు. మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి 82, మరొకరికి 80, మూడో కుమార్తెకు 70 ఏళ్ల వయస్సు. ఈ వయసులోనూ బామ్మ తన పనులు తానే చేసుకుంటుంది. ప్రతి రోజూ యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తారు. ఆహారం మితంగా తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. బామ్మకు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది ముని మనవలు ఉన్నారు.

కరోనా కేసులను గుర్తించే నిమిత్తం ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్ష చేయిస్తుండగా బామ్మకు గత నెల 19న పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆ సమయంలో ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఏ లక్షణాలూ లేవు. చికిత్స తీసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. అనంతరం గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంగా తిరిగి వచ్చిన ఆమెను పలకరిస్తే ఆనాటి ప్లేగు వ్యాధి వచ్చిన సంగతులు గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. తనకు బిపి, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. ఇప్పటికీ యోగా, ధ్యానం చేస్తుంటా.. అవే నా ఆరోగ్య రహస్యాలు.. కరోనాని జయించడానికి కారణాలు అని ఆనందంగా చెబుతున్న బామ్మ మాటలు అందరికీ స్ఫూర్తి దాయకం.

Tags

Next Story