కొవిడ్ ఎఫెక్ట్.. కస్టమర్ల కోసం బ్యాంకులు బంగారంపై..

కొవిడ్ కష్టకాలంలో కస్టమర్లకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు బంగారం విలువలో 75 శాతం మించకుండా రుణాలు జారీ చేస్తున్నాయి.
కరోనా కుటుంబ ఆదాయాలపై పెను ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ తరహా రుణాలకు రుణ విలువని 90 శాతం వరకు పెంచాలని నిర్ణయించామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. గోల్డ్ లోన్ లు జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ నిర్ణయం సానుకూల పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారంపై తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకు రుణం పొందొచ్చు. అయితే అదే స్థాయిలో వడ్డీ భారం కూడా ఉంటుందనేది గమనించవలసిన విషయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com