సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. నిందితురాలుగా రియా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తుంది. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిని నిందుతులుగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ ను సుశాంత్ తండ్రి కలిసి.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీంతో నితీష్ కుమార్ సిఫారుసుతో కేంద్రం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐని రంగంలోకి దించింది. విజయ్‌మాల్యా, అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ ఒప్పందం కుంభకోణం కేసులను దర్యాప్తు చేసిన స్పెషల్ టీం కు సుశాంత్ సింగ్ కేసును అప్పగించారు. పలు సెక్షన్ల కింద రియా చక్రవర్తితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, కుట్ర, దొంగతనం, మోసం, అక్రమ నిర్బంధం, బెదిరింపు తదితర అభియోగాలను సీబీఐ మోపింది. జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఇంట్లో విగత జీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును విచారించిన ముంబై పోలీసులు సుశాంత్ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు. తరువాత సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజకీయ, సినీవర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పోలీసులు సీబీఐకి అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com