సబాయ్ గడ్డితో ఉత్పత్తులు.. 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉషారాణి

సబాయ్ గడ్డితో ఉత్పత్తులు.. 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉషారాణి

మనకి ఉన్న వనరులనే ఉపయోగించుకోవాలి.. ఉపాధి మార్గంగా మలచుకోవాలి అని పెద్ద పెద్ద సార్లు వచ్చి చెప్పిన మాటలు ఉషారాణి నాయక్ చెవికి వినసొంపుగా అనిపించేవి. అక్షరం ముక్క చదువుకోకపోయినా అయ్యవార్లు చెప్పిన మాటలు వంటబట్టించుకుంది. స్థానికంగా పెరిగే సబాయ్ (నాపియర్) గడ్డితో పలురకాల హస్త కళాకృతులు తయారు చేసి విక్రయిస్తోంది. తనకు వచ్చిన కళను 200 మందికి పైగా గిరిజన మహళలకు నేర్పిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా గుజల్ దీహి గ్రామానికి చెందిన ఉషారాణి బాతూడీ అనే గిరిజన తెగ మహిళ. జీవితమంతా పేదరికంలోనే గడిచింది. తండ్రి కట్నం ఇవ్వలేని కారణంగా 22 ఏళ్లకు అప్పు చేసి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యింతరువాత కూడా అవే కష్టాలు వెంటాడుతుండేవి. గ్రామంలోని చాలా కుటుంబాల పరిస్థితి ఇదే. ఏదో ఒకటి చేయాలన్న తలంపు మదిని తొలిచి వేసింది. ఆ ఆలోచనతోనే గ్రామంలో 2001లో స్వయం సహాయక సంఘం ప్రారంభించింది. సంఘం తరపున పుట్టగొడుగులు, మేకలు, తేనెటీగల పెంపకం వంటివి చేపట్టినా అవన్నీ ఆదాయాన్ని పెంచలేకపోయాయి.

దాంతో మళ్లీ అవే కష్టాలు. అప్పుడే వచ్చిన ఆలోచన వాళ్ల జీవితాలను మార్చి వేసింది. స్థానికంగా పెరిగే సబాయ్ గడ్డితో గిరిజనులు రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. వాటిని కళాత్మకంగా తీర్చి దిద్ది పట్టణాల్లో విక్రయిస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చనిపించింది ఉషారాణికి. ముందుగా సబాయ్ గడ్డితో తాళ్లను తయారు చేసి అమ్మారు. జిల్లా పారిశ్రామిక కేంద్రంలో సబాయ్ గడ్డితో చాపలు, బుట్టలు, చాపలు, కుర్చీలు వంటి రకరకాల వస్తువులు తయారు చేయడంలో శిక్షణ తీసుకుని వాటికి మరింత సొబగులు దిద్ది కటక్ లోని ఎగ్జిబిషన్ లో విక్రయించారు.

తొలిసారి వాటిని అమ్మగా 20వేల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే వాటిని మరింత నాణ్యంగా, పటిష్టంగా చేయమని కోరారు. దాంతో ఒడిశా రూరల్ డెవలప్ మెంట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ సహకారంతో 25 లక్షల రూపాయల రుణం తీసుకుని మరింత నాణ్యత, సృజనాత్మకత జోడించి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. ఇంటి దగ్గరే ఉండి వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు ఉషారాణి. 2019లో 25 లక్షల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. వచ్చిన ఆర్డర్ ని మూడు నెలల్లో పూర్తి చేసి అందించారు.

మయూర్ శిల్పా. కామ్ లో ఆన్ లైన్ ద్వారా కూడా వారు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. డిగ్రీలు, ఆపై చదువులు చదివిన వారు కూడా సబాయ్ ఉత్పత్తులను తయారు చేయడం నేర్చుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం వారిని మరింత ప్రోత్సహించే దిశగా జిల్లా కేంద్రం బారిపాదా, రాజధాని భువనేశ్వర్ లో హస్తకళా ఉత్పత్తులు అమ్ముకోవడానికి షాపులు కేటాయించింది. భవిష్యత్తులో మరింత మందికి ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలనుకుంటోంది ఉషారాణి. చుట్టుపక్కల గ్రామాల్లో హస్తకళా ఉత్పత్తి సంఘాలను ప్రారంభించి నెలకు 20 వేల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఆమె సంపాదనతోనే కొడుకు కాలేజీకి వెళ్డానికి బైకు కొనిచ్చింది. తాను స్వయం శక్తి మీద నిలబడుతూ వందల మంది కుటుంబాల్లో ఉషస్సులు నింపుతున్న ఉషారాణిని ఊరంతా గౌరవంగా చూస్తారు.

Tags

Next Story