కడప జైల్లో కరోనా.. 19 మంది ఖైదీలకు..

కడప జైల్లో కరోనా.. 19 మంది ఖైదీలకు..

ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదికినా అందే గలడు నా 'శ్రీహరి' స్థానంలో ఇప్పుడు కరోనాని చేర్చుకోవాలేమో.. బడి, గుడి తేడాలేకుండా ఎక్కడ చూసినా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆఖరికి జైల్లో ఉన్న ఖైదీలనూ కరోనా వదిలిపెట్టట్లేదు. తాజాగా కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 19 మంది ఖైదీలకు పాజిటివ్ వచ్చిందని జైళ్ల శాఖ డీఐజీ ఎం వరప్రసాద్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలను జైలు ఆవరణలోనే క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసి అందులో ఉంచారు. భద్రత కారణాల దృష్ట్యా కొవిడ్ ఆస్పత్రులకు తరలించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా బాధితులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు నిరంతరం రోగులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. జైల్లో ఉన్న మొత్తం 700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జైల్లో ఉన్న ఖైదీలకు కరోనా ఎలా సోకిందని విచారణ చేపట్టగా.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల్లో పని చేసే ఖైదీలకు బయటి నుంచి వచ్చిన వారి ద్వారా వారికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, కడప జిల్లాలో ఇప్పటి వరకు 14,640 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఇందులో 8,955 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story