కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.. కానీ మనకెన్నో నేర్పింది: ప్రధానితో కేసీఆర్

కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.. కానీ మనకెన్నో నేర్పింది: ప్రధానితో కేసీఆర్

ఈ కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.. భవిష్యత్తులో కూడా మరిన్ని వైరస్ లు వచ్చే ప్రమాదం ఉంది. వైద్య రంగం మరింత అప్రమత్తంగా ఉండాలన్న గుణపాఠం మాత్రం కరోనా నేర్పింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో సమావేశంలో స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని దిల్లీ నుంచి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. దేశంలో కరోనా నియంత్రణ.. వివిధ రాష్ట్రంలాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్ నివారణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, దాని ఫలితమే వైరస్ బారిన పడినా కోలుకునే వారి సంఖ్య 71 శాతంగా ఉందని, ఇక మరణాల రేటు 0.7 శాతంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

కరోనా వచ్చి దేశంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యతను గుర్తు చేసిందని కేసీఆర్ అన్నారు. వైద్య రంగం ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎలా అప్రమత్తమవ్వాలి.. ముందు చూపుతో ఎలా ఎదుర్కోవాలనే గుణపాఠం నేర్పిందన్నారు.. గతంలో ఇలాంటి అనుభవనాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు.. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో అంచనా వేయలేం. కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది అని ఆయన అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది వైద్యులు ఉండాలి.. ఎన్ని వైద్య కళాశాలలు రావాల్సిన ఆవశ్యకత ఉంది.. లాంటి తదితర విషయాల గురించి చర్చించాలని అన్నారు.

వీటన్నింటిపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం భారతీయ వైద్య సంఘంపై ఉంది. దీనికి ప్రధాని చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కట్టుగా పనిచేసి దేశంలో వైద్య రంగానికి సంబంధించిన మౌళిక వసతులు మెరుగు పరచాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్ సూచించారు. ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు అవలంభిస్తున్నామని, ఈ పరిస్థితికి సంబంధించిన ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాలు అందించే సూచనలు, సలహాలు పాటిస్తున్నామని అన్నారు. వైద్యులు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story