కొవిడ్ వ్యక్తిని బైక్ పై ఆసుపత్రికి తీసుకువెళ్లిన టిఎంసి నాయకుడు..

కొవిడ్ వ్యక్తిని బైక్ పై ఆసుపత్రికి తీసుకువెళ్లిన టిఎంసి నాయకుడు..

కరోనా సీజన్.. పక్కింటి వాళ్లని పలకరించడానికి కూడా భయపడుతున్నారు. దగ్గినా, తుమ్మినా కరోనా భయంతో ఆమడ దూరం పారిపోతున్నారు. అలాంటిది ఓ పార్టీ యువజన కార్యకర్త కొవిడ్ లక్షణాలున్న ఓ వ్యక్తిని బైక్ పై తానే స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్లి శెభాష్ అనిపించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ జార్గ్రామ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయించుకునే స్థోమత కూడా లేదు ఆ కుటుంబానికి. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న గోపిబల్లవ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సత్యకం పట్నాయక్ తానే స్వయంగా బైక్ మీద ఆసుపత్రికి తీసుకువెళ్లి డాక్టరుకి చూపించారు. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చిన వలస కార్మికుడు అమల్ బారిక్ (43) కు నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. అయినప్పటికీ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కుటుంబం అంబులెన్స్ ఏర్పాటు చేయలేకపోయింది. కరోనా భయంతో గ్రామంలోని ఏ ఒక్కరూ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

విషయం తెలుసుకున్న సత్యకం పట్నాయక్ వెంటనే కార్యకర్తలను బైక్ ఏర్పాటు చేయమని కోరారు. ఫార్మసీకి వెళ్లి పిపిఇ కిట్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి కరోనా సోకిన వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఇంట్లో బారిక్ భార్యా పిల్లలు అతడి గురించి ఆందోళన చెందుతున్నారు. బారిక్ భార్య పదే పదే పట్నాయక్ ని వేడుకుంది. ఆమెను ఓదార్చి బారిక్ ని తీసుకుని బైక్‌పై గోపిబల్లవ్‌పూర్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు పట్నాయక్. వైద్యులు బారిక్‌ను పరీక్షించి, కొన్ని మందులు సూచించి ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉండమని సూచించారు.

పట్నాయక్ తిరిగి బారిక్ ను ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఏదైనా సహాయం కావాలంటే వెంటనే తెలియజేయమని చెప్పి వెళ్లారు. టిఎంసి నాయకుడు పట్నాయక్ పిపిఇ కిట్ ధరించి బైక్ నడుపుతూ బారిక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

"నేను ఈ మహమ్మారి కాలంలో ప్రజలతో నిలబడాలనుకుంటున్నాను. నాకు మరో నాలుగు వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ) తీసుకురమ్మని కార్యకర్తలను ఆదేశించాను. ఒకవేళ మళ్ళీ ఇలాంటి అవసరం ఎవరికైనా చేయాల్సి వస్తే పనికొస్తుందని పట్నాయక్ చెప్పారు. జార్గ్రామ్ లోక్ సభ మాజీ సభ్యుడు, టిఎంసి ప్రతినిధి ఉమా సోరెన్ మాట్లాడుతూ పార్టీ యువజన కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అని పట్నాయక్ చేసిన సహాయాన్ని కొనియాడారు.

Tags

Next Story