టాలీవుడ్ లో పెళ్లి సందడి.. సిరివెన్నెల ఇంట్లో కళ్యాణం
బ్యాచిలర్ లైఫ్ కి ముగింపు పలుకుతున్నారు టాలీవుడ్ హీరోలు. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివాళ్లైతే, నిహారిక నిశ్చితార్థం చేసుకుని పెళ్లి డేట్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా మరో నటుడు.. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు చెంబోలు రాజా తన నిశ్చితార్థం జరిగినట్లు శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఫిదా సినిమాలో వరుణ్ తేజకు అన్నయ్యగా నటించిన రాజా తన నిశ్చితార్థం ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు. కాబోయే భార్య వివరాలు తెలుపలేదు. కాగా రాజా.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం వంటి పలు చిత్రాల్లో నటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com