ఒడిశా రైలు ప్రమాదం.. 292కు చేరిన మృతులు

ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 292కి చేరింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అటు.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్లు రైల్వే అధికారులు అంటున్నారు. ట్రాక్‌ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కాసేపట్లో ప్రధాని మోదీ భువనేశ్వర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ప్రమాద స్థలానికి వెళతారు. ఆ తర్వాత కటక్‌లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను మోదీ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. నిన్న సాయంత్రం 6.50 నుంచి 7.10 మధ్యలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి ఓ బోగి నేలలో కూరుకుపోయింది. బోగీలను వెలికితీసేందుకు భారీ క్రేన్‌లు, జేసీబీలు రంగంలోకి దించారు.
ప్రమాద స్థలాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన బెంగాల్ వాసుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.
ఈ ప్రమాదానికి కారణాలేంటనేది అంతుచిక్కడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా రైళ్లు ఢీకొని ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికపరమైన సమస్యనా? నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు ప్రయాణికుల రైళ్లు, ఒక గూడ్స్ రైలు వెనువెంటనే ఢీకొనడంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది.
రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కవచ్ పేరుతో యాంటీ కొలిజన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ కవచ్ వ్యవస్థతో ఆటో మేటిక్‌గా బ్రేకులు పడతాయి. ట్రాక్‌లు సరిగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. ఎదురెదురు రైళ్లు వస్తున్నప్పుడు గుర్తించి అది ఆపుతుంది. అయితే ప్రస్తుతం ఈ కవచ్ వ్యవస్థ దేశంలో కొన్ని మార్గాల్లోనే అందుబాటులోకి వచ్చింది.
కోరమాండల్ రైలును బ్లాక్ ఫ్రైడే వెంటాడింది. 14 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 16 మంది మృతి చెందారు. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఆ ప్రమాదం కూడా నాడు శుక్రవారం రాత్రి ఏడున్నర నుంచి 7.40 గంటల సమయంలో జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com