రెజ్లర్లకు పెరుగుతున్న మద్దతు

రెజ్లర్ల ఆందోళనకు వివిధ సంఘాల మద్దతు పెరుగుతోంది. రెజ్లర్లకు మద్దతుగా రేపు రైతు సంఘాలు భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెజ్లర్లు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకుంటామని.. టికాయత్ ప్రకటించారు. రేపు జరిగే సమావేశానికి యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి వివిధ సంఘాల ప్రతినిధులు తరలిరానున్నారని చెప్పారు. ఇక నుంచి పోరు ఉధృతం చేస్తామన్నారు.
మరోవైపు రెజ్లర్ల ఆందోళనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పందించింది. నిరసన చేస్తున్న భారత రెజ్లర్లను అరెస్ట్ చేసి తాత్కాలికంగా నిర్బంధించడాన్ని ఖండించింది. అంతేకాదు.. కొన్నాళ్లుగా పెండింగ్‌లో పెట్టిన WFI ఎన్నికలను నిర్వహించకపోతే.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. భారత రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పేర్కొంది. బ్రిజ్‌భూషణ్‌పై వస్తున్న ఆరోపణల మీద క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ముందుకు కదలకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
మల్లయోధులపై మరోసారి ఎదురుదాడి చేశారు బ్రిజ్‌భూషణ్. తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని వెళ్లిన రెజ్లర్లు.. వాటిని రైతు నాయకుడు టికాయత్ చేతిలో పెట్టారని ఎద్దేవా చేశారు. రెజ్లర్ల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com