హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన వడగాల్పులు.. అర్థరాత్రి 12 గంటల వరకు..

Update: 2019-05-28 01:49 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మంటున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన వడగాల్పులు , ఉక్కపోతతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అగ్ని గుండంగా మారింది. అర్థరాత్రి 12 గంటల వరకు గాలి చల్లబడంలేదు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జగిత్యాల జిల్లా కోల్వాయి, ఎండపల్లి రాజారాంపల్లిలో పగటి ఉష్ణోగ్రత 47.9 డిగ్రీలుగా నమోదైంది. గత 130 ఏళ్లలో ఇది రెండో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు . రామగుండంలో 47.2, ఆదిలాబాద్‌లో 45.8 డిగ్రీలు నమోదు అయింది. గత పదేళ్ల మే నెల అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌ నగరంలో భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. ఇక థార్‌ ఎడారిని మించి హైదరాబాద్‌లో ఎండలు కొడ్తున్నాయి. మే 26న థార్‌లో 43.3 డిగ్రీలు కాగా, హైదరాబాద్‌ అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. బహదూర్‌పురలో చందూలాల్‌ బారాదరి వద్ద 44.1, మాదాపూర్‌లో 44 డిగ్రీలు నమోదు అయింది.

ఆంధ్రప్రదేశ్‌ లోని రేణిగుంటలో అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 47 నుంచి 48 డ్రిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఎండలు తీవ్రత పెరగడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు తల్లడిల్లుతున్నారు.

Similar News