భారత్ మండిపోతోంది..అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే..
భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో టాప్-10 భారత్‌లోనే ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
భారతావని మండిపోతోంది. ఉష్ణతాపానికి జనం అల్లాడుతున్నారు. వడ గాల్పులు తోడవ్వడంతో బయటకు రావాలంటేనే భయపడ్తున్నారు. తప్పనిసరై బయటకు వచ్చిన వారు భానుడి భగభగలకు ఇబ్బందులు పడ్తున్నారు.
ఆదివారం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే ఉన్నాయి. ఎల్‌డొరాడో వెబ్‌సైట్ విడుదల చేసిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని చురు 48.9 డిగ్రీలతో తొలిస్థానంలో నిలిచింది. శ్రీగంగానగర్‌ది 48.6 డిగ్రీలతో రెండో స్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా, హరియాణాలోని నర్నువాల్ కూడా జాబితాలో ఉన్నాయి.
భారత్‌లో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాల్లో ఢిల్లీ, లక్నో, కోట, హైదరాబాద్, జైపూర్ ఉన్నాయి. హిమాలయల్లోని అత్యంత చల్లని ప్రదేశాలైన సిమ్లా, నైనిటాల్, శ్రీనగర్ లాంటి నగరాల్లోనూ సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. హిల్ స్టేషన్లలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజులు రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలూ పెరగడంతో వడగాలుల తీవ్రత పెరిగింది.
మరోవైపు ఏటా వడదెబ్బ మృతులు దేశంలో పెరుగుతున్నారు. 2010-2018 మధ్య 6,167 మంది చనిపోయారు. ఇందులో 2081 మంది ఒక్క 2015లోనే మృత్యువాత పడ్డారు. నాసా వివరాల ప్రకారం.. ఉష్ణోగ్రతల సేకరణ మొదలైన 1880 నాటి నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 ఏళ్లు ఈ శతాబ్దంలోనే ఉన్నాయి. 1880 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా సగటున 0.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరగ్గా.. భారత్‌లో అది 0.8 డిగ్రీలుగా ఉంది. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2018 నిలిచింది. రుతుపవనాలు ఆలస్యమైతే.. ఆ స్థానాన్ని 2019 ఆక్రమించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.
మరోవైపు ఎడారి మీదుగా దేశంలోకి ప్రవేశిస్తున్న పశ్చిమ పవనాలే వడగాలులకు కారణమని ఐఎండీ అంటోంది. రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉందని చెబుతోంది. బంగాళాఖాతం, వాయువ్య దిశ నుంచి వచ్చే పశ్చిమ పవనాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.