అప్పుడు 70వేలు..ఇప్పుడు 30 వేలా?..ఓటమిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Update: 2019-06-04 01:55 GMT

ఏపీలో ఓటమిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. మరో ఐదేళ్లు అవకాశం ఇచ్చి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సైబరాబాద్‌ లాంటి నగరం నిర్మించే వాళ్లమని స్పష్టం చేశారు. అమరావతిలోని తన నివాసంలో కుప్పం నియోజకవర్గం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పంలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై ఆరా తీశారు. గతంలో 70వేల మెజార్టీ వస్తే.. ఈసారి 30 వేలే వచ్చిందని, మెజార్టీ తగ్గడానికి కారణాలు తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తల్ని కోరారు.

హంద్రీనివా కాలువ ద్వారా కుప్పం శివారు వరకూ నీళ్లు తెచ్చామని ఎందుకు మెజార్టీ తగ్గిందో అన్వేషించాలని టీడీపీ నేతల్ని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం కుప్పంలో పర్యటిస్తామని స్పష్టం చేశారు. కుప్పంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పుకొచ్చారు. జరిగింది వదిలేసి భవిష్యత్‌ వైపు నడవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పోరాటం టీడీపీకి కొత్తేమీ కాదన్నారు చంద్రబాబు. వెనకడుకు వేయకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మనం ఎలాంటి తప్పు చేయలేదన్నారు చంద్రబాబు. ధైర్యంగా ముందుకువెళ్ధామంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. చిన్నచిన్న లోపాలను సవరించుకుని భవిష్యత్‌ కోసం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే వైసీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.