తెరాస కార్యకర్తల బీభత్సం.. భార్యని, తల్లిని కొట్టి.. ఇంటి గేట్లు ఊడదీసి..

Update: 2019-06-06 02:39 GMT

తెలంగాణలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. యాదాద్రిలో కాంగ్రెస్‌ నేత ఇల్లును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మహబూబూనగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాలా గ్రామాల్లో పరిస్థితిలు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి

తెలంగాణలో ప్రాదేశిక ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌-విపక్ష కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎక్కడికక్కడ బాహాబాహీకి దిగుతున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లా దేవరకొండ డివిజన్‌ పరిధిలోని పాత్లానాయక్ తండాలో టీఆర్ఎస్, సీపీఐ వర్గాల ఘర్షణ హింసాత్మకంగా మారి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ ఘటన మరిచిపోకముందే చందుపట్ల గ్రామంలో తమకు సహకరించలేదని టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతతో పాటు అతని కుటుంబంపై దాడి చేశారు. చందుపట్ల నుంచి టీఆర్ఎస్‌ తరపున కొండల్‌ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆయనకు సహకరించలేదని కోపంతో కాంగ్రెస్ నాయకుడు సాగర్ రెడ్డి ఇంటిపై కొండల్‌ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దీనిపై ప్రశ్నించిన సాగర్ రెడ్డి భార్య, తల్లిని కూడా కొట్టారు. ఇంటి గేట్లు ఊడదీసి బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి వెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రాజకీయ కక్షలు భగ్గమన్నాయి. డోకూరు గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు రాడ్డుతో కొట్టి చంపేశారు. అలాగే మహబూబ్‌నగర్ మండల పరిధిలోని రామచంద్రాపురంలో జరిగిన గొడవలో అనసూయ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. టీఆర్ఎస్, టీఆర్ఎస్ రెబల్ వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఆమె మృతి చెందింది. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ రామరాజేశ్వరి సంఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో తలెత్తిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. ఇప్పటికీ చాలాగ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి.

Similar News