బెజవాడ రౌడీల బెండు తీస్తున్న పోలీసులు

Update: 2019-06-21 07:43 GMT

బెజవాడ రౌడీల బెండు తీస్తున్నారు పోలీసులు. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న నగరంలో ఈమధ్య మళ్లీ అలజడి రేగుతోంది. తాగిన మైకంలో.. రౌడీషీటర్లు అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టిన డీసీపీ విజయరావు... కఠిన హెచ్చరికలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

రౌడీ షీటర్ల వేధింపులు భరించలేక ప్రజలు తిరగబడుతున్నారు. ఇటీవల వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన కిలారి సురేష్ అనే రౌడీ ఆగడాలు భరించలేని ఇద్దరు ఆటో డ్రైవర్లు నమ్మకంగా అతి కిరాతకంగా అంతమొందించారు. ఈ ఘటనతో బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. దీంతో పోలీస్ కమీషనర్ ద్వారక తిరుమలరావు రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన డిసిపి2 విజయరావు కృష్ణలంక, సూర్యారావుపేట, గవర్నర్ పేట, సత్యనారాయణ పురం, వన్ టౌన్, 2 టౌన్, భవానిపురం, ఇబ్రహీంపట్నం, నున్న, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను తన కార్యాలయానికి పిలిపించించారు. స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు డీసీపీ విజయరావు.

జోన్2లో ఎంతమంది రౌడీలు ఉన్నారు? వాళ్లలో జైల్లో ఉన్నది ఎవరు? బయట తిరుగుతున్నది ఎంతమంది? సత్రప్రవర్తన కలిగిన వారు ఉన్నారా? మళ్లీ పాత జీవితానికే అలవాటు పడ్డారా? ఇలా అన్ని కోణాల్లో ఆరా తీశారు పోలీసులు. ముఖ్యంగా శివారులో క్రైమ్ రేట్ పెరుగుతుండడంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. మారితే సరి.. లేదంటే ఖాకీ ట్రీట్‌మెంట్ తప్పదని హెచ్చరించారు. పిడి యాక్టు పెట్టి నగర బహిష్కరణ చేస్తామని సూటిగా చెప్తున్నారు.

Similar News