మైనార్టీలకు టికెట్లు ఇవ్వొద్దన్నారు..

Update: 2019-06-26 09:16 GMT

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత మోదీని ఢీకొట్టడానికి SP-BSP ఒక్కటయ్యాయి. యూపీలో స్వీప్‌ చేస్తామన్నారు... కానీ ఆశలు నీరుగారిపోయాయి.. అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే.. ఓటమికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మాయా వర్సెస్‌ అఖిలేష్‌ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది.

బీజేపీ చేతిలో చావుదెబ్బ తిన్న SP- BSP మధ్య మాటలయుద్ధం రోజురోజుకు ముదురుతోంది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి మిత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కలిసి పోటీచేసినా... మొత్తం 80 సీట్లలో 15 మాత్రమే ఇరుపార్టీలు గెలుచుకున్నాయి. ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ఓటమికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్పీ నేతలపై మాయావతి మాటలదాడి కొనసాగిస్తున్నారు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని.. దీంతో ఎస్పీ అభ్యర్ధులకు బిఎస్పీ కార్యకర్తలు ఓట్లు వేయలేదన్నారు. పొత్తు వల్ల తమకే నష్టం జరిగిందని మాయావతి ఆరోపించారు. మైనార్టీలకు టికెట్లు ఇవ్వొద్దని తనతో అఖిలేష్‌ చెప్పినట్టు సంచలన ఆరోపణలు కూడా చేశారు మాయావతి. మైనార్టీలకు సీట్లు ఇస్తే... పోలరైజేషన్‌ జరిగి బీజేపీకి అనుకూలంగా మారుతుందని అఖిలేష్‌ భయపెట్టారన్నారు. ఎస్పీ నేతల అవగాహన రాహిత్యం... క్షేత్రస్తాయి పరిస్థితులు తెలియకపోవడంవల్ల BSP నష్టపోయిందన్నారు. గతంలో ములాయం ముఖ్యమంత్రిగా తనపై పెట్టిన కేసులను కూడా బీజేపీ నేతలు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఒకప్పుడు దొంగ అని చెప్పిన పార్టీతోనే పొత్తులు పెట్టుకున్నారంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ప్రతికూలంగా మారిందని మాయావతి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

మొత్తానికి పొత్తులతో లాభపడతామని.. భావించి మరింత దిగజారామని మాయావతి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేసిన మయావతి... అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Similar News