కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలు.. ఎక్కువగా ఎదురుచూసేది వారే!

Update: 2019-07-05 03:57 GMT

శుక్రవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? సంక్షేమమా..? సంస్కరణలా...? మోదీ ప్రభుత్వం దేనికి ప్రాధాన్యం ఇవ్వనుంది..? ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2014-19 మధ్య తొలి నాలుగేళ్లు ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేసిన మోదీ సర్కారు, చివరి ఏడాది సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి, రైతు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు ప్రకటించింది. మరి తాజా బడ్జెట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. అన్నదాతలు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, పారిశ్రామిక-కార్పొరేట్ వర్గాలు, రియల్ ఎస్టేట్, మౌలిక రంగాలు బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు ప్రకటిస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అన్నదాతలు ఈసారైనా తమ కష్టాలకు విరామం లభించాలని కోరుకుంటున్నారు. రైతులకు అండగా నిలవడానికి బడ్జెట్‌లో పలు కొత్త నిర్ణయాలు ఉంటాయని సమాచారం. లక్ష రూపాయల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించే స్కీమ్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో 7లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసి, ఉపాధి పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

బడ్జెట్‌ కోసం ఎక్కువగా ఎదురుచూసేది మధ్యతరగతి ప్రజలు, పన్ను చెల్లింపుదారులే. ఆదాయపు పన్ను చెల్లింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలని వేతనజీవులు కోరుతున్నా రు. అయితే ఐటీ పరిమితిని 3 లక్షల వరకు పెంచే అవకాశముందని కేంద్రం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గృహరుణాలపై వడ్డీరాయితీ కూడా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలకు కూడా కళ్లెం వేయాలని ప్రజల కోరుతున్నారు.

ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ ఆందోళనకరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో వినియోగం తగ్గిపోవడం, ప్రభుత్వ-ప్రైవేటు పెట్టుబడులు కుదించుకుపోవడం, అంత ర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలతో దేశ వృద్ధి రేటు మందగించింది. ఎకనామిక్ సర్వే కూడా కొంతమేర ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. మన దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8 శాతం దాటాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇక పారిశ్రామిక ప్రగతి మందగించడం, వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయట పడకపోవడం, ఆశించిన మేర వర్షపాతం లేక దేశవ్యాప్తంగా కరవు-కాటకాలు పెరిగిపోవడం, ఉద్యోగ-ఉపాధి కల్పన తగ్గి నిరుద్యోగం ఎక్కువ కావడం తదితర అంశాలు ఎన్డీఏ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయి.

గతంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. మోదీ హయాంలో రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో కలిపేశారు. వార్షిక బడ్జెట్‌లోనే రైల్వేలకు కేటాయింపులు చేస్తున్నారు. అలాగే, ఇటీవలి కాలంలో ఛార్జీల పెంపు, కొత్త రైల్వే లైన్ల ప్రకటన పెద్దగా లేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తారా...? లేక.. రాష్ట్రాల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతారో చూడాలి.

Similar News