భయపెడుతున్న భారీ వర్షాలు

Update: 2019-07-14 05:33 GMT

ఈశాన్యరాష్ట్రాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతల మవుతున్నాయి. ఓవైపు వరదలు, కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లో అరుణాచల్, అస్సాం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో పదుల సంఖ్యలోచనిపోయారు. అస్సాంలోని 21 జిల్లాల్లోని 8.7 లక్షల మంది ప్రజలపై వరదల ప్రభావం పడింది.

గోలాఘట్‌, డీమా హసావో జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందిని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు. మరో 48 గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తోంది. 2,168 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 51 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అస్సాం ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ల్లోనూ భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. హై అలర్ట్‌ ప్రకటించారు.. రెండు రాష్ట్రాల్లో వరద కారణంగా చాలా చోట్ల జనజీవనం స్థంభించింది.

ఈశాన్య భారతదేశంలోనే కాదు.. నేపాల్‌ను సైతం భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 43 మంది మరణించారు. మరో 20 మంది గల్లంతయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రదేశాలలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ప్రధాన జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా నదులు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నది ఒడ్డున నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

Similar News