గవర్నర్‌, విప‌క్ష స‌భ్యుల మధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ

Update: 2019-07-16 01:26 GMT

తెలంగాణలో సచివాలయ భవనాల కూల్చివేతను గవర్నర్‌ అడ్డుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.. భవనాల పరిరక్షణలో గవర్నర్‌ శ్రద్ధ చూపకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. భ‌వ‌నాల కూల్చివేత‌ను అడ్డుకోవాల‌ంటూ రాజ్‌భవన్‌ గ‌డ‌ప తొక్కిన అఖిల‌ప‌క్షం నాయ‌కులు ప్రజాధనం దుర్వినియోగాన్ని ఆపాల‌ని నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. వాస్తు, మూఢ నమ్మకాలతో కేసీఆర్‌ సచివాలయ భవనాలను కూల్చాల‌ని చూస్తున్నార‌ని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. భవనాలను కూల్చి కొత్తవి కట్టడంవల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. భవనాల తరలింపు కుట్ర అని.. తరలింపులో కీలకమైన రికార్డులు మాయమైతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. గవర్నర్‌ స్పందించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు హస్తం నేతలు.

కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి కొత్త సచివాలయం, అసెంబ్లీ అంటూ మాట్లాడటంపైనా అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. సచివాలయానికి కొత్త భవనం నిర్మించాలనే కేసీఆర్‌ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సెక్షన్‌ 8 ప్రకారం ఆస్తుల పరిరక్షణ బాధ్యత గవర్నర్‌దేనన్న నేతలు.. ఈ అంశాన్ని మరోసారి గవర్నర్‌ ముందు చదివి వినిపించారు.

మరోవైపు ఈ భేటీలో గవర్నర్‌ నరసింహన్‌కు, విపక్ష నాయకులకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గవర్నర్‌ వద్దకు వెళ్లగానే ఏం జరుగుతోంది రేవంత్‌ అంటూ పలుకరించారు. అయితే, షబ్బీర్‌ అలీ జోక్యం చేసుకుని మీరు ఇద్దరు సీఎంలనే చూసుకుంటున్నారని, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కామెంట్స్‌ చేశారు. షబ్బీర్‌ అలీ వ్యాఖ్యలపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చెప్పుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. మరోసారి షబ్బీర్‌ అలీ మాట్లాడే ప్రయత్నం చేయగా మీరు అలా మాట్లాడొద్దని, రెండు రాష్ట్రాలను చూసుకుంటున్నానని గవర్నర్‌ సూటిగా ఆన్సరిచ్చారు. ఇద్దరి మధ్యా చర్చ జరుగుతున్న సమయంలో జానారెడ్డి కలుగజేసుకుని.. గవర్నర్‌గా మీరున్నారని గుర్తుండేలా చేసి వెళ్లాలని అన్నారు. ఇక గవర్నర్‌తో భేటీ సందర్భంగా అఖిలపక్ష నేతలు తమ కార్యాచరణను ప్రకటించారు.. ఆస్తుల పరిరక్షణపై గవర్నర్‌ జోక్యం చేసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Similar News