కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం !

Update: 2019-07-17 03:24 GMT

కర్ణాటక పొలిటికల్‌ ఎపిసోడ్‌ సీరియల్‌లా సాగుతోంది. క్షణ క్షణం మలుపులు.. రాజకీయ ట్విస్టులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ గందగోళానికి నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటికే సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహత్గీ, స్పీకర్ పక్షాన అభిషేక్‌మను సింఘ్వీ, సీఎం కుమారస్వామి తరఫున రాజీవ్ ధావన్ తమ వాదనలు వినిపించారు.

స్పీకర్‌ రాజీనామాలను ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని ముకుల్ రోహత్గీ ఆరోపించారు. అనర్హత అస్త్రాన్ని చూపిస్తూ ఎమ్మెల్యేలను భయపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న రోహత్గీ, అసంతృప్త ఎమ్మె ల్యేలను అసెంబ్లీ నుంచి తొలగిస్తే ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రోహత్గీ వాదనలకు సింఘ్వీ దీటుగా కౌంటరిచ్చారు. రాజీనామాలపై నిర్ణయం కంటే అనర్హత పిటిషన్లపై నిర్ణయమే ముఖ్యమని సింఘ్వీ పేర్కొన్నారు. జూలై 12 నాటి ఆర్డర్‌లో మార్పు చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై విధించిన స్టేటస్ కోను ఎత్తేయాలని కోరారు. స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదని రాజీవ్ ధావన్ వాదించారు.

ముగ్గురి వాదనలూ విన్న సుప్రీం కోర్టు రాజీనామాలు, అనర్హత వేటు అంశాలపై ఎలా నిర్ణయం తీసుకోవాలో స్పీకర్‌కు చెప్పలేమని స్పష్టం చేసింది. కానీ ఇక్కడ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదానిపై రాజ్యాంగ అభ్యంతరం ఉందా లేదా అన్నదే ప్రశ్న అని అభిప్రాయపడింది. దీనిపై ఇవాళ తుది తీర్పు ప్రకటిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

స్పీకర్ రమేష్ కుమార్ సైతం అసంతృప్త ఎమ్మె ల్యేల రాజీనామాలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విధించిన స్టేటస్ కోను ఎత్తేయాలని కోరిన స్పీకర్, నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి తాత్సారం చేయబోనని హామీ ఇచ్చారు. స్పీకర్‌ నిర్ణయం, సుప్రీం తీర్పు ఎలా ఉండబోయినా.. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రేపు బలనిరూపణకు సీఎం కుమార స్వామి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. IMA పోంజీ స్కామ్‌లో నిందితునిగా ఉన్న రోషన్ బేగ్, ముంబైకు వెళ్తుండ గా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయన్ను స్టేషన్‌కు తరలించి విచారించారు. విచారణ తరువాత మళ్లీ ఇంటికి పంపించారు.

సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్షకు కొన్ని గంటలే సమయం ఉంది. దీంతో ఇవాళ సుప్రీం తీర్పు ఎలా ఉంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే అంశంపై రెబెల్స్‌ తర్జనభర్జన అవుతున్నారు.. ఇటు రాజకీయ పార్టీల్లో, అటు కన్నడ ప్రజల్లో తాజా పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

Similar News