భారీ వర్షాలు ముంబైకి మేలు చేశాయి. కానీ కేరళకు ప్రమాదకరంగా మారాయి. తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ముంబై వాసుల తాగునీటి కష్టాలను తీర్చాయి. కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇడుక్కి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఇంతకీ కుంభవృష్టి ముంబాయికి ఎలా మేలు చేసింది? కేరళకు ఎలాంటి నష్టం కలిగిస్తోంది?
గత కొన్ని రోజులుగా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టి వానలకు మహానగరం అతలాకుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ వానలే కురవకపోయివుంటే ముంబై వాసులకు తాగునీటి కష్టాలు మరింత ఎక్కువయ్యేవి. వేసవిలో 10 శాతం తాగునీటికి కోతపెట్టింది బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్. వర్షాలు పడి చెరువులు నిండాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది. దీంతో ఇన్నాళ్లు విధించిన 10 శాతం నీటి కోతను ఎత్తివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ వార్త వినగానే ముంబై వాసులు సంతోషంతో ఎగిరి గంతేశారు.
వర్షాలు కురవని టైంలో, సమ్మర్‌లో మహానగర వాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి సందర్భంలో మున్సిపల్ కార్పొరేషన్ నీటి కోత విధిస్తోంది. 2015లో 25 శాతం, 2014లో 20 శాతం, 2009లో 30 శాతం నీటి కోత విధించింది. ఇక 1993లోనైతే ఏకంగా 40 శాతం నీటికి కోతపెట్టడంతో జనం అవస్థలకు అంతులేకుండా పోయింది...
ముంబాయిలో వర్షాలు పుష్కలంగానే కురుస్తాయి. కానీ లోపమంతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దగ్గరే ఉంది. నీటి వృథాను అరికట్టడంలో బృహన్‌ముంబాయి విఫలమవుతోంది. నిరంతరం జరిగే నిర్మాణ రంగమే నీటి వృథాకు పెద్ద సమస్యగా మారింది. రియాల్టీ రంగం వల్ల ఏటా 850 మిలియన్ లీటర్ల నీరు వేస్ట్ అవుతోంది. ఇక 60 శాతం మురుగు నీటిని శుద్ధి చేయడంలో ఫెయిలవుతోంది మహానగర పాలక సంస్థ. దీని అలసత్వం వల్లనే ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. అయితే వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఈ సంస్థ చర్యలు చేపట్టింది. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని 2002 నుంచి తప్పనిసరి చేసింది. ఇక కొత్తగా ఏర్పాటైన జల శక్తి మంత్రిత్వ శాఖ ముంబాయిలో నీటి వృథాను అరికట్టి సరిగా వినియోగించుకునేలా పెద్ద ఉద్యమమే చేపట్టబోతోంది...
మరోవైపు కుండపోత వానలు కేరళను వణికిస్తున్నాయి. వరదల ఉధృతి పెరిగింది. ఈ దెబ్బకు ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఇక కాసర్‌గాడ్, కోజికోడ్, వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది వాతావరణ శాఖ....
గత 48 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లోని మూడు ప్రాజెక్టులు నిండిపోయాయి. వాటిలోని వరద నీటిని తగ్గించడానికి అధికారులు గేట్లు ఎత్తేశారు. వానలతోపాటు బలమైన గాలులు వీస్తున్నాయి. వాయువ్య దిశ నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది....