జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై దాడి జరిగింది. అతని ఇంటి ఓనర్ తనపై దాడి చేసినట్లు చెబుతున్నాడతను. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్బిగూడలో వినోద్ ఉంటున్నాడు. ఇళ్లు కొనుగోలు వ్యవహారంలో తనతో గొడవ పడిన ఇంటి ఓనర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది.
ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన గొడవలే దాడికి కారణంగా తెలుస్తోంది. తాను అద్దెకు ఉంటున్న 70 గజాల ఇంటిని కొనేందుకు పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు వినోద్. అయితే..అడ్వాన్స్ తీసుకున్న ఓనర్..ఇంటిని అమ్మనని చెప్పేశాడు. అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేది లేదని దబాయించినట్లు వినోద్ చెబుతున్నాడు. డబ్బుల కోసం తాను నిలదీయటంతో ఇంటి ఓనర్ తో పాటు అతని కుటుంబసభ్యులు దాడి చేసినట్లు చెబుతున్నాడతను.
ఇంటి ఓనర్ పురమాయించిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడికి చేసినట్లు వినోద్ చెబుతున్నాడు. తనపై హత్యాయత్నం జరిగిందన్న వినోద్ ఫిర్యాదుతో ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.