జషిత్‌ కిడ్నాప్‌ కేసు.. నిందితుల సీసీటీవీ ఫుటేజ్ లభ్యం!

Update: 2019-07-27 06:31 GMT

జషిత్‌ కిడ్నాప్‌కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఆధారాలతోపాటు.. జషిత్ చెప్పిన వివరాలను సరిపోల్చిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. దాదాపు 17 టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌కు గురై.. ఆపై క్షేమంగా ఇంటికి చేరిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. కేసులో చిక్కుముడి మాత్రం ఇంకా వీడలేదు. జషిత్‌ కుటుంబానికి పరిచయం ఉన్నవారే కిడ్నాప్ చేశారా? లేక బయటి వ్యక్తుల పనేనా? అన్నది తేలాల్సి ఉంది. జషిత్ తండ్రికి ప్రతీ ఆదివారం క్రికెట్ ఆడే అలవాటు ఉండటం.. చుట్టుపక్కల ప్రాంతాలైన మండపేట,అనపర్తి ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారడంతో.. బెట్టింగ్ ముఠాల పైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మండపేట, అనపర్తి ప్రాంతాలకు ప్రతీ ఆదివారం పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు వస్తుంటాయి. ఇక్కడ పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతుంటాయి. ఎవరైనా బెట్టింగ్ డబ్బులు ఎగ్గొడితే.. ఇక వారికి మూడినట్టే. ముక్కు పిండి మరీ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో జషిత్ తండ్రికి బెట్టింగ్ ముఠాతో ఏమైనా గొడవలున్నాయా?.. అన్న కోణంలో పోలీసులు ఫోకస్ చేశారు. బెట్టింగ్ ముఠాల పైనే ఎక్కువగా ఆరోపణలు వస్తుండటంతో.. ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Similar News