కశ్మీర్‌లో బలగాల మోహరింపుపై రగడ

Update: 2019-07-28 16:15 GMT

కశ్మీర్‌లో బలగాల మోహరింపు అంశం రగడ రాజేస్తోంది. కశ్మీరీ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్రస్థా యిలో మాటల యుద్ధం జరుగుతోంది. కశ్మీర్‌కు అదనంగా బలగాల ను తరలింపును కశ్మీర్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైన్యాన్ని మోహరించి కశ్మీర్ సమస్యను పరిష్కరించలేరని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మరోసారి స్పష్టం చేశారు. ఎక్కువగా బలగాలను మోహరిస్తే, అది కశ్మీరీల మనోభావాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దు ల్లా కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. సైన్యం అండతో కశ్మీర్ సమస్యను పరిష్కరించాలనుకోవడం సరైన మార్గం కాదన్నారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించే అవకాశముందన్నారు.

కశ్మీరీ పార్టీల తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తామని, ప్రతి దానిని విమర్శించడం సరి కాదని హితవు పలికారు. అభివృద్ధి మంత్రంతో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దనే ఉద్దేశంతో అదనంగా బలగాలను మోహరిస్తున్నామని వివరించారు.

మరోవైపు, కశ్మీర్‌కు అదనపు బలగాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగానే భద్రతను పటిష్టం చేస్తున్నామని పేర్కొంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్నాయని, అంతర్గతంగా కూడా సంఘవిద్రోహ శక్తులు చెలరేగే ప్రమాదముందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కశ్మీర్ లోయలో భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని, వాటిని ఛేదించడానికే సైన్యాన్ని మోహరిస్తున్నాని వివరించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతే కశ్మీర్‌కు అదనంగా 10 వేల మంది పారామిలటరీ బలగాలను తరలించాలని నిర్ణయం తీసుకున్నామని హోంశాఖ వర్గాలు వివరించాయి.

Similar News