వరదనీటితో పరవళ్లు తొక్కుతోన్న గోదావరి నది

Update: 2019-08-01 02:25 GMT

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు భారీవర్షాలకు తోడు ఎగువనుంచి వరదనీటితో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. పోలవరం నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదారి వరద నీటితో ఉభయగోదావరి జిల్లాల్లో పలు గ్రామాల ముంపులో చిక్కికున్నాయి. దేవీపట్నం మండలంలో 32 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

దవళేశ్వరం నుంచి నీటి విడుదలతో కొవ్వాడ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొత్తూరు కాజ్‌వేపైకి 11 అడుగుల వరకు నీరు చేరడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాజమహేంద్రవరంలో గోదావరి వరద ఉధృతికి నిత్యహారతి పంటు కొట్టుకుపోయింది. ఏకంగా పుష్కర ఘాట్ నుంచి ధవళేశ్వరం వరకూ ఇది వెళ్లిపోయింది. గానుగులగొంది, ఏనుగులగూడెం గ్రామాలు నీటమునగగా.. ముంపు గ్రామాల్లో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలు, రెండు లాంచీలు ఏర్పాటుచేశారు.

Full View

గోదావరి వరద పోలవరం ప్రాజెక్ట్‌ను ముంచెత్తుతోంది. వరదను తట్టుకోవడానికి స్పిల్‌ వే ఎగువన వేసిన అడ్డుకట్టకు అధికారులు గండి కొట్టారు. స్పిల్‌ వేలో 5 నుంచి 17 పిల్లర్ల వరకు గ్రావిటీ ద్వారా నీరు దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ దగ్గర 6.6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 11.45మీటర్లుగా నమోదైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. ఆగస్ట్‌ 3 నుంచి 6 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. సముద్రతీరంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ తెలిపింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Similar News