జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. శ్రీనగర్‌లోని నిట్ కాలేజీకి చెందిన 120 మంది తెలుగు విద్యార్ధులను ప్రత్యేక బస్సుల్లో జమ్మూ తరలించారు. వారంతా అక్కడినుంచి అండమాన్ రైల్‌లో ఢిల్లీ చేరుకున్నారు. ఈ విద్యార్ధులను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం..స్వాగతం పలికింది. వారికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేసింది. ఇవాళ ప్రత్యేక రైలులో హైదరాబాద్ మీదుగా.. వారి స్వస్థలాలకు తరలించనున్నారు అధికారులు.
తెలంగాణ విద్యార్ధులు ఎంత మంది వచ్చినా వారందరికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని ఆదేశించారు. నిఘా వర్గాల హెచ్చరికలతోనే శ్రీనగర్‌లోని నిట్ విద్యార్ధులను వారి స్వగ్రామాలకు తరలిస్తున్నట్లు హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం అనివార్యమన్నారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.