కోనసీమ అతలాకుతలం.. ఇళ్లపై తలదాచుకుంటున్న జనం

Update: 2019-08-06 07:13 GMT

గోదావరికి వరద పోటెత్తుతోంది.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.. అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.. అయితే, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక, నిత్యావసర వస్తువులు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.. బాధితులను ఆదుకోవాలని మంత్రులు, అధికారులకు సూచించారు.

గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారుగా 350 గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. 400 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటు చూసినా నీరే తప్ప.. నేల కనిపించని పరిస్థితి నెలకొంది. వరద ప్రాంతాల ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతూరు ఏజన్సీ ప్రాంతంలో మరో 16 గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది. ఏటా వచ్చే వరదే అయినా, ఈ స్థాయిలో ఎప్పుడూ కనిపించలేదు.. ఈసారి పోలవరం ప్రాజెక్టు కోసం నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా వరద తాకిడి ఎక్కువగా ఉంది.

గోదావరి ఉగ్రరూపంతో వారం రోజులుగా లంక గ్రామాల ప్రజలు వరద నీటిలోనే మగ్గుతున్నారు. ఇళ్ల పైకప్పు వరకు నీరు చేరడంతో పాటు సామాగ్రి సైతం కొట్టుకుపోయాయి. దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోట్లపై ప్రయాణం చేస్తున్నారు. లంక గ్రామాలతో పాటూ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.

దేవీపట్నంలో పరిస్థితి దయనీయంగా ఉంది. బాధితులు ఇళ్లను వదిలి వెళ్తున్నారు. మరికొందరు కొండ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద ముంపు ఉందని గత మూడు నెలలుగా అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. తినడానికి తిండి కూడా అధికారులు అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో చేసేది లేక ఇళ్లపై జనం తలదాచుకుంటున్నారు. నిత్యావసర సరుకులు సైతం అందుబాటులో లేకపోవడంతో తల్లడిల్లి పోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ముంపు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

అటు పోలవరం, సీతానగరం, రాజమహేంద్రవరం సహా కోనసీమలోని పలు లంక గ్రామాల్లో వరద నీరు చేరడంతో పంటలకు అపారనష్టం ఏర్పడింది. 14 మండలాల్లో సుమారుగా 45 వేల ఎకరాల పంట నీటి పాలైనట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. లంక గ్రామాల ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించారు.

మరోవైపు గోదావరి వరదలతో ఉభయగోదావరి జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో ఆలస్యం చేయొద్దని సూచించారు. ఒకటో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే పలు గ్రామాలు ముంపునకు గురవడంపై జగన్‌ సీరియస్‌గా స్పందించారు. దీనికి కారణాలేంటో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అయితే, మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని జగన్‌ ఆదేశించారు.

Full View