ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌ కామెంట్‌

Update: 2019-08-06 11:40 GMT

జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. క‌శ్మీర్ విభ‌జ‌న‌, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను ర‌ద్దు చేయడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ఈ చర్య ద్వారా జాతీయ భ‌ద్రతకు పెను ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌ను ఏకప‌ క్షంగా విభ‌జించి జాతీయ సమగ్రత‌ను కాపాడ‌లేర‌ని చెప్పుకొచ్చారు. ప్రజాప్రతినిధుల‌ను అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అభివర్ణించారు. ప్రజల ఐక్యతతోనే ఈ దేశం ఏర్పడిందని, భూములతో కాదని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ విషయంలో మోదీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య విలువలను కూలదోసిందని ఘాటుగా విమర్శించారు.

జమ్మూ కశ్మీర్‌ వ్యవహారంలో కేంద్రం అనుసరించిన తీరు అప్రజాస్వామికమని బెంగాల్‌ సీఎం, తృణమూ ల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్‌ అంశంపై ఓటింగ్‌, సమగ్ర చర్చ లేకుండా ప్రభుత్వం తొందరపా టుతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లులకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు.

మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ కూడా ఆర్టికల్-370 రద్దును తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టిక‌ల్ 370, 35Aల‌కు ప్రత్యేక‌త ఉంద‌ని, వాటిలో మార్పులు చేయాల‌నుకుంటే, చర్చల ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Similar News