మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మాస్టారు పుట్టగొడుగుల కోసమని తన పొలంలోకే వెళ్లారు. ఉదయం అనగా వెళ్లిన వ్యక్తి చీకటి పడుతున్నా ఇంటికి చేరలేదు. ఏం జరిగిందో అని ఆరా తీస్తే పులి నోటికి చిక్కి బలైపోయినట్టు తెలుసుకున్నారు గ్రామస్తులు. ఈ ఘటన సియోనీ జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్టులో జరిగింది. జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీప గ్రామానికి చెందిన మనోజ్ ధుర్వే అనే 23 ఏళ్ల వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో విజిటింగ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పారెస్టకు సమీపంలో ఆయనకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పుట్టగొడుగులు మొలకెత్తుతుంటాయి. వాటిని తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. సాయింత్రమైనా ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు గ్రామస్తుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 గంటల సమయంలో అడవిలో అతని పాదరక్షలను గుర్తించారు. పులి అతడి శరీరాన్ని లాక్కెళ్లినట్లు రక్తపు మరకలు కనిపించాయి. పులి అతడి దేహంలోని కండర భాగాలను పీక్కు తినేసింది. దీంతో ముఖం కాళ్లు మాత్రమే మిగిలాయి. ఆ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అడవిలో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా, ఇటీవలి కాలంలో ఈ టైగర్ ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఊళ్లోకి వస్తూ మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.