ప్రస్తుతానికి సోనియానే అయినా.. పర్మినెంట్ అధ్యక్షులు మాత్రం వారే..!

Update: 2019-08-12 01:06 GMT

తీవ్ర ఉత్కంఠ నడమ ఎట్టకేలకు...కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియమితులయ్యారు. రాహుల్‌ రాజీనామా తర్వాత అధ్యక్ష పదవిలో ఎవరిని కూర్చోబెడతారా అన్న సస్పెన్స్‌ కొనసాగింది. మల్లిఖార్జున ఖర్గే, సుశీల్‌ కుమార్‌ షిండే, ముకుల్‌ వాస్నిక్‌ వంటి నేతలతో పాటు సచిన్‌ పైలెట్‌, జ్యోతిరాదిత్య సింథియా, మిలింద్‌ డియోరా, మనీశ్‌ తివారీల పేర్లు వినిపించాయి. ఓ దశలో ప్రియాంక గాంధీ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ వీరెవరూ కాదని... చివరికి మరోసారి సోనియాకే పట్టం కట్టింది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ..

కాంగ్రెస్‌కు.... గాంధీ నెహ్రూ ఫ్యామిలీ తప్ప మరో దిక్కుగా లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్‌ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై అధ్యక్ష పదవిలో ఇతర నేతల్ని చూడకపోవచ్చనే నిర్ణయానికి వచ్చారు హస్తంనేతలు. ప్రస్తుతానికి సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించినా... త్వరలో మరోసారి రాహుల్‌ లేదా ప్రియాంకనే ఈ పదవి చేపడతారనే ప్రచారం జరుగుతోంది. 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. రోజురోజుకు కాంగ్రెస్‌ ప్రభ కోల్పోతోంది. ఆ పార్టీకి మార్గ నిర్దేశనం చేసే నాయకుడే కరువయ్యారు.

రాహుల్‌గాంధీ.... అధ్యక్షపదవికి దూరమైన తర్వాత.. దాదాపు రెండు నెలలుగా ఆ పార్టీకి అధ్యక్షులే లేరు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా... ఇతర వ్యక్తిని కూర్చోబెట్టాలంటూ రాహుల్‌... అధ్యక్షపదవి నుంచి దిగిపోయారు. దీంతో గాంధీ కుటుంబేతర వ్యక్తి కోసం తీవ్రంగా వెతికింది హైకమాండ్‌. చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికి చివరికి. మళ్లీ సోనియాకే పట్టం కట్టింది ‌పార్టీ అత్యున్నతస్థాయి కమిటీ..

పార్టీ స్థాపించినప్పటి నుంచి నెహ్రూ-గాంధీల చేతుల్లోనే ఉంది కాంగ్రెస్‌. గతంలో సీతారాం కేసరి, మాజీ ప్రధాని పీవీ వంటివారు అధ్యక్షులైనా పెద్దగా ఉపయోగం లేకపోయింది. సొంత నిర్ణయాలు తీసుకోవడంతో వారిని ఆ పదవి నుంచి తొలగించారు. సీతారాం కేసరిని ముప్పు తిప్పలు పెట్టి... చివరికి ఆపదవి నుంచి తప్పించారు. ఇక పీవీది సైతం ఇదే పరిస్థితి. అప్పటి నుంచి.. కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడిని చూడలేదు దేశం. ఇప్పటికైనా ఈ సంప్రదాయాన్ని మార్చాలంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు.

Similar News