జరిమానా కట్టలేదని మూడు రోజులపాటు ఇంటి ముందే మృతదేహం

Update: 2019-08-17 06:26 GMT

మనిషి బతికున్నప్పుడు ఎలా ఉన్నా మరణించిన తర్వాత అతనిపై సానుభూతి చూపిస్తారు. ఎంత బద్ధ శత్రువుగా ఉన్న మృతి చెందినవారిపై కొంత కనికరం ఉంటుంది. కానీ ఒడిశాలో జరిగిన ఓ ఘటన మానవత్వానికే కళంకాన్ని తెచ్చిపెట్టింది. పదేళ్ల క్రితం ఊరి పెద్దలు విధించిన జరిమానా కట్టలేదని ఒక మహిళ మృతదేహానికి దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకున్నారు. మానవత్వం లేకుండా ఆ కుటుంబంపై కర్కశత్వంతో వ్వవహారించారు. డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబ ఆవేదనను ఆ పెద్దలు అర్ధం చేసుకోకపోవడంతో మూడు రోజులపాటు మృతదేహం ఇంటిముందే ఉండిపోయింది.

ఓడిషాలోని జొసాబాడి గ్రామానికి చెందిన సోరేన్‌ అనే యువకుడు పదేళ్ల క్రితం పక్క గ్రామంలోని మరో తెగ చెందిన పార్వతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడాన్ని ఆ ఊరి పెద్దలు వ్యతిరేకించారు. పంచాయితీ పెట్టి సోరేన్‌కు ఇరవై వేల జరిమానా విధించారు. అతని పేదరికం వల్ల ఆ జరిమానాను చెల్లించలేక పోయాడు. మూడు రోజుల క్రితం ఆయన భార్య పార్వతి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు నిరాకరించారు. జరిమానాను చెల్లించిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలని తీర్మానించారు.

సోరేన్‌ వద్ద డబ్బు లేక చెల్లించలేకపోయాడు. దీంతో ఎవరు కూడా మృతదేహాన్ని తరలించడానికి ముందుకు రాలేదు. మూడు రోజుల పాటు మృతదేహం ఇంటిముందే ఉండిపోయింది. చివరకు పోలీసులు చొరవ తీసుకుని దహనక్రియలు చేయించారు.