పందిట్లో పెళ్లి హడావిడి.. గదిలోకి వెళ్లిన పెళ్లి కూతురు..

Update: 2019-09-04 05:11 GMT

అప్పటి వరకు పెళ్లి పీటల మీద కూర్చుని పురోహితుడు చెప్పినట్లు చేస్తున్న వధువు.. పెళ్లి కుమారుడు తాళి కట్టే సమయంలో చీర మార్చుకుంటానని గదిలోకి వెళ్లింది. అంతే మళ్లీ బయటకు రాలేదు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తమిళనాడు వేలూరు జిల్లా వాణియంబాడి ప్రాంతానికి చెందిన యువతికి గుడియాత్తం ప్రాంతానికి చెందిన మేనమామతో వివాహం నిశ్చయించారు పెద్దలు. ఆదివారం రాత్రి పెళ్లి విందు జరిగింది. సోమవారం పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. బంధుమిత్రుల ఆనందోత్సాహాలు, భాజాభజంత్రీల మధ్య పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పురోహితుడు మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు.

పెళ్లి కుమార్తె చీర మార్చుకుని వస్తానని వెళ్లింది. ఎంతకీ బయటకు రావట్లేదు. పది నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానని వెళ్లిన ఆమె అరగంటైనా అడ్రస్ లేదు. అనుమానం వచ్చిన పెద్దలు తలుపు కొట్టినా తీయలేదు. ఇకలాభం లేదని తలుపులు బద్దలు కొట్టి చూశారు. లోపల పెళ్లి కూతురు లేదు. వెనుక డోర్ నుంచి వెళ్లి పోయింది. ఆమె వెళ్లింది ఎవరూ చూడలేదనడం, ఎక్కడికి వెళ్లిందీ తెలియదనడం వరుడి కుటుంబసభ్యులకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. పెళ్లి ఇష్టం లేకపోతే ముందుగానే చెప్పొచ్చుకదా అని వధువు కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించగా మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లి కూతురు పారిపోవడం వెనుక బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News