విమానం ఎక్కుతూ కంటతడి పెట్టిన విమలా నరసింహన్

Update: 2019-09-07 11:43 GMT

తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. తొలుత గవర్నర్ నరసింహన్ దంపతులను హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు ఆత్మీయంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన నరసింహన్ సేవలు కోల్పోవడం బాధగా ఉందన్నారు కేసీఆర్. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి, ధైర్యం చెప్పి, స్ఫూర్తి నింపిన నరసింహన్ తో తనకు అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని తెలిపారు. నరసింహన్ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.

Full View

మరోవైపు ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా గవర్నర్‌ నరసింహన్ ఉద్వేగానికి గురయ్యారు. పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం వంటి లక్షణాలు సీఎం కేసీఆర్‌లో కనిపించాయని ఆయన చెప్పారు. తన అమ్మ చనిపోయినప్పుడు, కేవలం 15 నిమిషాల్లో వచ్చి, అన్ని చూసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాల్లో మానవత్వం ఉందని ప్రశంసించారు నరసింహన్. పేరుకు తగ్గట్టు పనిచేస్తేనే సార్థక నామధేయుడంటారని ఆయన చెప్పారు. అందుకే అప్పుడప్పుడు నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చిందని చమత్కరించారు.

ప్రగతి భవన్‌ లో సన్మానం తర్వాత గవర్నర్ నరసింహన్ దంపతులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికారు.

వీడ్కోలు సందర్భంగా గవర్నర్‌ నరసింహన్ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. విమలా నరసింహన్ విమానం ఎక్కుతూ కంట తడి పెట్టడం అక్కడున్న వారందరినీ కలిచి వేసింది. గవర్నర్‌ నరసింహన్ దంపతులు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. రేపు తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజ్‌భవన్‌లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Similar News