దేవీపట్నం ఏజెన్సీని మళ్లీ ముంచెత్తిన వరద.. రెండురోజులు ఇంటిపైకప్పు..

Update: 2019-09-09 02:45 GMT

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏజెన్సీని మళ్లీ వరద ముంచెత్తింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహం కారణంగా.. విలీన మండలాలతోపాటు ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు 2 రోజులుగా ఇళ్లపైకప్పులపైనే గడపాల్సిన దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ ఆలయం మూసేశారు. అమ్మవారి ఆలయంలోకి నీరు చేరడంతో పునరావాసం కోసం అక్కడకు చేరినవారు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఏజెన్సీలోని 34 గ్రామాలు ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపానికి వణికిపోతున్నాయి. 2 రోజులుగా కరెంటు లేక రాత్రిళ్లు చీకట్లోనే గడపాల్సి వస్తోంది. తాగునీటికి, తిండికి కూడా ఇబ్బంది పడుతూ వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎక్కువ ఇళ్లు మునిగిపోయిన 18 గ్రామాల్లో ప్రజల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా మందిని ఊళ్ల నుంచి అక్కడికి తరలించారు. కొండమొదలు, కచ్చులూరు, మంటూరు, పెనికెలపాడు, గానుగ గొంది, మూలపాడు, వీరవరపులంక, ఏ వీరవరం సహా పలు గ్రామాల్లో వరద జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది.

ఇటీవలి వరదలతో దాదాపు 3 వారాలు నరకం చూసిన ఏజెన్సీవాసులు మళ్లీ ముంపు ముప్పుతో దినదినగండంగా బతుకుతున్నారు. పంటలు పూర్తిగా మునిగిపోయి ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నామని.. మరోసారి వరద కారణంగా కట్టుబట్టలతో మిగిలామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Also Watch

Full View

Similar News