చర్చలు విఫలం.. ఆర్టీసీ సమ్మె యథాతథం - జేఏసీ నేత

Update: 2019-10-04 02:18 GMT

త్రిసభ్య కమిటీతో గురువారం జరిపిన ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి సమ్మె యథాతథంగా ఉంటుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు జేఏసీ నేత అశ్వాద్థామరెడ్డి. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చందుకు సమ్మె చేసి తీరుతామని తేల్చి చెప్పారు. కమిటీపై నమ్మకం లేకనే సమ్మెలోకి దిగుతున్నామని.. ప్రభుత్వమే తమను సమ్మెలోకి నెట్టిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ చర్యలు లేవని ఆరోపించారు. ఎస్మా చట్టాలు ప్రయోగించినా భయపడేదిలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రైవేటు బస్సు డ్రైవర్లను రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

త్రిసభ్యు కమిటీ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందంటోంది. అధ్యయనం కోసం 2 నెలల సమయం కావాలని కోరినట్లు తెలిపారు త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు సోమేష్‌ కుమార్‌. దసరా పండుగ సమయంలో సమ్మెను వాయిదా వేసుకోవాలన్న ఆయన.. అవసరమైతే శుక్రవారం మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్టీసీ అధికారులు దృష్టిపెడతారని, కాబట్టి నివేదిక ఇవ్వడం ఆలస్యమవుతుందన్నారు. పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అందరికి న్యాయం జరిగేలా రిపోర్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

సమ్మె అనివార్యమవడంతో.. ప్రభుత్వం ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టింది. తాత్కాలిక ఉద్యోగుల నియామానికి ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని ఆదేశించింది. హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ ఉండి.. 18 నెలల అనుభవం ఉన్నవారిని డ్రైవర్‌గాను, పదో తరగతి చదివినవారిని కండర్టర్లుగా అవకాశం కల్పించనుంది. ఇక. ప్రైవేటు స్కూల్‌ బస్సులు నడిపే డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని భావిస్తున్నారు. ఇందుకు గాను రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ. 1000 చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఓ వైపు దసరా వేళ ఆర్టీసీ సమ్మె జరుగుండటంతో.. ముందుగానే.. ఊర్లకు వెళ్లిపోతున్నారు ప్రజలు. దీంతో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

Similar News