ప్రియురాలి ప్రేమకు పరీక్ష పెడదామనుకున్న ప్రియుడికి..

Update: 2019-10-22 07:19 GMT

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి బుల్ బుల్ పిట్టా.. నిజమైన ప్రేమకు కొలమానం ఏం ఉంటుంది. అయినా ఆమె ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు ప్రియుడు. ప్రేమికులుగా మారిన వారి స్నేహం సహజీవనానికి దారి తీసింది. ఆమె ప్రేమలో నిజమెంతో తెలుసుకునేందుకు ఓ పరీక్ష పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌‌కు చెందిన మేహుల్ జోషి తన ప్రియురాలు ఇషాతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెను ఆట పట్టించాలని తనకు తానే కిడ్నాప్ చేసుకున్నాడు. ఆఫీసుకు వెళ్తున్నాని చెప్పి బయటకు వెళ్లిన జోషి.. ఫోన్‌లో కొత్త సిమ్ వేసుకుని ఇషాకు ఫోన్ చేశాడు. వాయిస్ చేంజ్ యాప్ ద్వారా ఫోన్ చేసే సరికి ఆమె జోషి గొంతు గుర్తుపట్టలేకపోయింది. నీ ప్రియుడిని కిడ్నాప్ చేశాం.. అతడిని అప్పగించాలంటే రూ.లక్ష రూపాయలు తీసుకొని రావాలనేది ఫోన్ సారాంశం.

దీంతో కంగారు పడిన ఇషా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్‌ని ట్రేస్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారు అన్నది మొత్తం కూపీ లాగారు. కిడ్నాపర్లు గాంధీధామ్‌లోని ఓ లాడ్జిలో ఉన్నారని తెలుసుకున్నారు. ఆ విషయం తెలియని జోషి అప్పటికే లాడ్జి నుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న బస్టాండ్‌లో నిలుచున్నాడు. పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇదంతా నాటకం అని.. ఇషాకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనే అలా చేశానని జోషి ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పోలీసులంటే ఆటలుగా ఉందా.. ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తావా అని జోషిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 182 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Similar News