మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలిపోనున్నాయి. దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్ని ఈ రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలమే వికసిస్తుందని తేల్చేశాయి. అయితే హర్యానాలో మాత్రం కమలదళానికి గెలుపు అనుకున్నంత ఈజీగా దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతోంది ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలున్నాయి. బీజేపీకి 75 వరకు సీట్లు వస్తాయని చాలా సంస్థలు అంచనా వేశాయి. వీటన్నింటికీ భిన్నంగా ఆసక్తికరమైన రిజల్ట్స్‌ను ఇచ్చింది ఇండియా టుడే సర్వే.
హర్యానాలో నెక్ టు నెక్ పోటీ ఉంటుందని చెబుతోంది ఇండియా టుడే. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఇక్కడ బీజేపీ కేవలం 32 నుంచి 44 సీట్లకే పరిమితం అవుతుంది. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే తక్కువ స్థానాలు వస్తాయని చెబుతోంది. 2014లో ఇక్కడ కమలదళం 47 సీట్లను గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటాపోటీగా 30 నుంచి 42 స్థానాలు గెల్చుకుంటుందని.. ఇండియాటుడే అంచనా వేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ కేవలం 15 సీట్లకే పరిమితం అయింది.
ఇండియా టుడే సర్వే మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా వెల్లడించింది. జననాయక్ జనతా పార్టీ 6 నుంచి 10 స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని చెప్పింది. ఇక ఓట్ల షేరింగ్ చూస్తే.. బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 32 శాతం, జేజేపీకి 14 శాతం ఓట్లు పడతాయని తేల్చింది. మొత్తానికి అందరికంటే భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించి ఆసక్తిని రేకెత్తించింది ఇండియాటుడే.