హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 43,284 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డిపై గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలోనూ సైదిరెడ్డినే ఆధిక్యం ప్రదర్శించారు. ఈ ఉప ఎన్నికలో సైదిరెడ్డి రికార్డు బ్రేక్ చేశారు. నియోజకవర్గంలో సైదిరెడ్డికి వచ్చిన మెజార్టీ ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి రాలేదు. భారీ మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అభివృద్ధికే హుజూర్ నగర్ ప్రజలు పట్టం కట్టారని విజయం తరువాత సైదిరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధే తనను గెలిపించాయన్నారు. తనపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్‌తో పాటు.. పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఈ ఉప ఎన్నికల ఫలితంతో తేలిపోయిందన్నారు సైదిరెడ్డి.